21-12-2012….యుగాంతం.. అప్పుడేనా?

శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ భూమి వయసు దాదాపు 450 కోట్ల ఏళ్లు. సౌర కుటుంబంలో భాగంగా ఏర్పడ్డ ఈ ధరిత్రి తొలినాళ్లలోనే విపరీతమైన విధ్వంసాన్ని చవిచూసింది. అన్నిదిక్కుల నుంచి దూసుకొచ్చిన ఉల్కాశకలాలు ఒకవైపు.. మహా అగ్నిపర్వతాలు మరోవైపు చెలరేగిపోయాయి. భూమిపై నిలువెల్లా గాయాలు మిగిల్చాయి. అయినా ఏం కాలేదు. జీవం పుట్టింది. మనిషీ పుట్టుకొచ్చాడు. మనుగడ సాగిస్తున్నాడు.

తొలినాళ్ల పరిస్థితి ఇదైతే… ఆ తరువాతి కాలంలో భూమిపై అనేక వినాశనాలు చోటు చేసుకున్నాయి. కొంచెం కచ్చితంగా చెప్పాలంటే కనీసం అయిదుసార్లు నేలపైన, నీటిలోను ఉన్న జీవజాతుల్లో సగానికి పైగా అంతరించిపోయాయి. శిలాజ ఆధారాలనుబట్టి చూస్తే చిట్టచివరి మహా వినాశనం సుమారు 45 కోట్ల ఏళ్ల క్రితం సంభవించింది. మునుపటివాటికంటే తీవ్రమైన ఈ సంఘటనలో కనీసం 70 శాతం జీవులు అంతరించిపోయాయి. ఇదంతా ఎందుకు చెపాల్సివచ్చిందంటే.. ఎంత భారీ స్థాయిలో వినాశనం జరిగినా ఈ భూమ్మీద జీవం ఉనికిని తుడిచిపెట్టడం అసాధ్యమని చెప్పేందుకే. ఇక ప్రస్తుతానికి వద్దాం…

2012 డిసెంబరు 21న మహా వినాశనం సంభవిస్తుందని కొన్నేళ్లుగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దక్షిణ అమెరికా ప్రాతంలో వేల ఏళ్ల క్రితం ఉన్న మాయన్లు తయారు చేసుకున్న కేలండర్‌లోని తేదీలు ఆ రోజుతో ముగుస్తాయి కాబట్టి అక్కడితో ఈ యుగం అంతమైపోతుందని కొందరు అంటున్నారు. మరోవైపు సౌరకుటుంబంలో ఇప్పటివరకూ ఎవరూ చూడని(?!) గ్రహం భూమిని ఢీకొంటుందన్నది ఇంకొందరి సిద్ధాంతమైతే… భూ అయస్కాంత క్షేత్రం తిరగబడటం వల్ల విపత్తు సంభవిస్తుందనేది మరికొందరి ఊహ. ఇవే కాకుండా గ్రహ కూటమి తెచ్చే అరిష్టమని, బైబిల్‌లో పేర్కొన్నారని, నక్షత్ర పేలుడని రకరకాల విధ్వంస కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక్కోదాంట్లో వాస్తవమెంతో చూద్దాం.

పాతది పోతే…
కొత్తది వస్తుంది..
మాయన్ నాగరకత కాలం నాటి కేలండర్ గురించి ముందుగా చూద్దాం.. ఈ కేలండర్‌లోని అంశాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ కాలం ప్రజలు కాలాన్ని ఎలా లెక్కించారో తెలుసుకోవాలి. వీరికి 20 రోజుల కాలం ఒక వినాల్. అలాగే 320 రోజుల కాలం ఒక టున్, 19.7 సంవత్సరాలు ఒక కటూన్, 394.3 ఏళ్లు ఒక బక్టూన్. ఈ నేపథ్యంలో మాయన్ అవశేషాల్లో తరచూ కనిపించే ఓ తేదీ ‘13.0.0.0.0’ అన్ని వివాదాలకూ కారణమైంది. ఈ తేదీని మన సౌరమానంలోకి మారిస్తే మొత్తం 5,125.36 ఏళ్లు.

అంటే మాయన్ల కేలండర్‌లో ఇన్నేళ్లు ఉంటాయన్నమాట! మాయన్లు కచ్చితంగా ఇన్నేళ్ల క్రితమే తమ కేలండర్‌ను తయారు చేసుకున్నారనుకుంటే అందులో చివరి రోజు ఈ ఏడాది డిసెంబరు 21వ తేదీన వస్తుంది. కేలండర్ ఆ రోజుతో అంతమైపోతుంది కాబట్టి మనిషికీ పోగాలం దాపురించినట్టేనని కొందరి నమ్మకం. అయితే మాయన్ల నాగరకతను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నవారు… మాయన్ల వారసుల్లో చాలామంది ఈ సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదు. అంతేకాదు.. మాయన్ల కేలండర్‌లోనూ అనేక రకాలు ఉన్నాయని, ఒక్కదాన్నే పరిగణనలోకి తీసుకోలేమన్నది వీరి వాదన.

ప్లానెట్ ఎక్స్… లేనే లేదు!

గ్రహాల అధ్యయనం కొత్తగా మొదలైందేమీ కాదు… అత్యాధునిక టెలిస్కోపుల సాయంతో వందల ఏళ్లుగా సాగుతున్నదే. ఈ నేపథ్యంలో 3,600 ఏళ్ల కక్ష్యా మార్గమున్న ఓ దుష్టగ్రహం భూమిని ఢీకొడుతుందని, వినాశనం సృష్టిస్తుందని కొందరు చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. నిబిరూ… ప్లానెట్ ఎక్స్… ఎరిస్.. ఇలా రకరకాల పేర్లతో ఈ దుష్టగ్రహం ప్రాచుర్యంలోకి వచ్చింది. నిబిరూ గ్రహం గురించి మెసపొటేమియా, మాయన్ ప్రజలకు తెలుసునని కూడా ప్రచారం జరిగింది. నిజానికి నిబిరూ అన్న పేరు సుమేరియా/బాబిలోనియా నాగరకతలో మర్డుక్ అనే దేవుడి పేరు. గురుగ్రహాన్ని ఈ పేరుతో పిలిచేవారు.

ఎరిస్ అన్నది ప్లూటోకు ఆవల ఉన్న ఓ లఘుగ్రహం (చంద్రుడి కంటే తక్కువ సైజున్నది) అని, దీని కక్ష్యాకాలం 557 ఏళ్లేకానీ… 3,600 ఏళ్లు కాదని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. అంతేకాకుండా గ్రహాలతోపాటు, భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు నాసా చేపట్టిన ‘నియర్ ఎర్త్ ప్రాజెక్ట్ (నియో) ద్వారా కూడా దుష్ట గ్రహం వల్ల భూమికి ముప్పు అన్న అంశం పుక్కిటి పురాణం మాత్రమేనని స్పష్టమైంది.

ధ్రువాలు మారతాయా?… అయస్కాంత క్షేత్రం తిరగబడుతుందా?
భూమి నిర్మాణం మూడుపొరల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే. కేంద్రభాగం ఘనస్థితిలో.. ఆపై పొరలో ద్రవ, ఘన పదార్థాలు కలిసి ఉండటం వల్ల.. భూమి ఓ డైనమోలా పనిచేస్తుందని.. ఫలితంగా దీని చుట్టూ ఓ విద్యుదయస్కాంత క్షేత్రం ఆవరించి ఉంటుందని కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దీన్ని ఆధారంగా చేసుకుని కొందరు భూమి లోపలి పొర అకస్మాత్తుగా తిరగబడటం వల్ల ధ్రువాలు తారుమారై… భూమి అంతరించిపోతుందని ఓ కథనాన్ని ప్రచారంలోకి తెచ్చారు. అయితే శాస్త్రవేత్తలు దీన్ని ఖండిస్తున్నారు.

గతంలో ధ్రువాల స్థానంలో మార్పులు ఉన్నప్పటికీ అది చాలా నెమ్మదిగా మాత్రమే జరిగిందని, పదిలక్షల సంవత్సరాలకు ఒక డిగ్రీ అటు ఇటు కదిలిందని వారు అంటున్నారు. సుమారు 80 కోట్ల ఏళ్లక్రితం మాత్రం ధ్రువాల స్థానంలో కొంచెం ఎక్కువస్థాయి మార్పు ఉన్నట్లు చూచాయగా మాత్రమే తెలిసిందని వారి అంచనా. అయస్కాంత క్షేత్రంలో పూర్తిస్థాయి మార్పులు జరిగేందుకు కూడా సుమారు అయిదు వేల ఏళ్ల సమయం కావాలని శాస్త్రవేత్తలు చెబుతుతున్నారు. సుమారు 7.8 లక్షల ఏళ్ల క్రితం చివరిసారి భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు వచ్చాయని, అయినప్పటికీ ఎలాంటి విపత్తూ సంభవించలేదనేందుకు ఆధారాలు ఉండటం గమనార్హం.

ఏతా వాతా ఒక్క విషయం మాత్రం స్పష్టం… ఈ ఏడాది డిసెంబరు 21న ఏం జరిగినా, జరక్కపోయినా… ఆ వెంటనే 22వ తేదీ రావడమూ ఖాయం… మనం ఇక్కడే సలక్షణంగా ఉండటమూ ఖాయమే!

గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

Post navigation

Leave a Reply